థాయ్‌లాండ్‌లో రైలుపై క్రేన్ ఎలా పడింది..? 22 మంది మృతి వెనుక అసలు కారణం ఏంటి?
థాయ్‌లాండ్‌లోని సిఖియో జిల్లాలో భయంకర రైలు ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై భారీ క్రేన్ పడటంతో పట్టాలు తప్పిన రైలు, బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, 79 మందికి పైగా గాయాలయ్యాయి.
థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ప్రమాదం దేశాన్ని షాక్‌కు గురి చేసింది. చాలా భయంకరంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రైలు మీదకు అకస్మాత్తుగా ఒక భారీ క్రేన్ పడింది. దీంతో రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు పెట్టుకుంటూ బయటకు పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 79 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో మొత్తం 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చాలా మందికి కాలిన గాయాలు, ఎముకలు విరిగిన గాయాలు కావడంతో ఆసుపత్రులకు తరలించారు.
స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెస్క్యూ బృందాలు బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఘటన స్థలమంతా అగ్నికీలలు, పొగతో నిండిపోయింది.
హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం ట్రాక్‌ల దగ్గర నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. క్రేన్ ఎలా రైలు మీద పడిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సంతాపం తెలిపింది. ఈ ప్రమాదం థాయ్‌లాండ్‌లో పెద్ద విషాదంగా మారింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0