మహిళలకు శుభవార్త.. త్వరలో ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులతో ఫ్రీ బస్ ప్రయాణం
తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు త్వరలో జారీ కానున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీ ట్రావెల్ పథకాన్ని వినియోగించే ప్రతి మహిళకు ప్రత్యేకంగా ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు జారీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత ప్రయాణ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో, స్మార్ట్ కార్డ్ విధానం తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
వచ్చే నెల నుంచే ఈ చిప్ ఆధారిత కార్డుల జారీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. మహిళలు బస్సులో ఎక్కిన తర్వాత టికెట్ మెషీన్‌పై కార్డును ట్యాప్ చేస్తే ఆటోమేటిక్‌గా టికెట్ జనరేట్ అవుతుంది. దీంతో టికెట్ జారీ ప్రక్రియ వేగంగా పూర్తవడంతో పాటు డేటా కూడా సులభంగా నమోదు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
మొదటిగా పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి కార్డులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ స్మార్ట్ కార్డుల వల్ల ప్రయాణికుల వివరాలు స్పష్టంగా నమోదు కావడంతో పాటు దుర్వినియోగాన్ని కూడా నియంత్రించవచ్చని భావిస్తున్నారు. మహిళల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై మంచి స్పందన వస్తోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0