ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ కారు పేలుడు – 8 మంది మృతి, ఉగ్రవాద కోణంపై దర్యాప్తు
ఢిల్లీ ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి 8 మంది మృతి చెందారు. షకీల్ ఖాన్, స్థానికులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు దృశ్యాలను వివరించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు, దర్యాప్తు కొనసాగుతోంది.
"నా జీవితంలో ఇంత భారీ శబ్దం నేను ఎప్పుడూ వినలేదు. ఆ పేలుడు శక్తి అంత తీవ్రంగా ఉండటంతో నేనేమో మూడుసార్లు నేలపై పడిపోయాను. ఆ క్షణంలో ఇక బతకమన్న భావన వచ్చింది," అంటూ ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భయంకర పేలుడు ఘటనను ఒక స్థానిక వ్యాపారి భయంతో వివరించాడు.
దేశ రాజధానిలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎర్రకోట మెట్రో పరిసరాల్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ పేలుడు ఘటన ప్రజల్లో తీవ్రమైన ఆందోళనకు దారితీసింది. ఈ విస్ఫోటనంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని ముట్టడించి, పేలుడు వెనుక ఉన్న కారణాలను వెలికితీయడానికి దర్యాప్తు చేపట్టారు.
ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్-1 సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారులో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పక్కన ఉన్న మరో మూడు, నాలుగు వాహనాలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలం దృశ్యం చూసిన వారెవరైనా భయంతో వణికిపోయేంతలా ఉంది.
ఒక వ్యాన్ తలుపులు పేలిపడి ఎగిరిపోయాయి, మరో కారు పూర్తిగా చిద్రమైపోయింది. ఇంకొక వాహనంలోని అద్దాలు చెల్లాచెదురయ్యాయి. క్షతగాత్రుల కేకలతో ఆ ప్రాంతమంతా భయభ్రాంతి వాతావరణం నెలకొంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించారు.
"మా ఇంటి టెర్రస్‌పై నిలబడి ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో భారీ అగ్నిగోళం లా వెలుగు చిమ్మింది. వెంటనే చెవులు భరించలేనంత పెద్ద శబ్దం వినిపించింది. మా ఇంటి కిటికీలు కూడా తీవ్రంగా కంపించాయి," అని ఒక ప్రత్యక్ష సాక్షి భయంతో వివరించారు.
"నేను ఆ సమయంలో గురుద్వారాలో ఉన్నాను. అకస్మాత్తుగా ఓ గట్టిగా పేలిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎంత బలంగా ఉందంటే, క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాకపోయింది," అని మరో వ్యక్తి చెప్పారు.
సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక విభాగం 20 ఫైరింజన్లను ఘటనాస్థలికి తరలించి మంటలను అదుపులోకి తీసుకుంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీల్చేసి, వాహన రాకపోకలను నిలిపివేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ మరియు ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
అయితే, ఈ పేలుడు స్వరూపం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫోరెన్సిక్ మరియు సాంకేతిక నిపుణుల బృందాలు ఘటనాస్థలికి చేరుకొని కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి. పేలుడుకు కారణమైన అంశాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇదే రోజు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక ఇంటిలో దాదాపు 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం కావడం ఢిల్లీ ఘటనపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక వైద్యుడు అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లో ఈ పేలుడు పదార్థాలు దొరకడంతో, ఢిల్లీలో జరిగిన పేలుడు వెనుక ఉగ్రవాద అనుమానం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0